ప్రథమ స్కంధము 1-10

1.శ్రీ కైవల్యపదంబు( జేరుటకునై చింతించెదన్ లొకర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేక స్తంభకు( గేళీలోలవిలసద్దృగ్జాల సంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహనందాంగనాడింభకున్.
జన్మమృత్యు రహితమైన మోక్ష స్థితి పొందుటకై,పరమాత్మునిలో ఐక్యత జేందుటకై ,లొకైక రక్షకుడు,జగత్ సృష్టికి కారకుడు,భక్తులను పాలించి లాలించటంలోనూ,తొందరగా భక్తులను రక్షించటమనెడి కళలో అరి తేరినవాడు,నా అంతటి వాడేవడూ లేడు,నా దగ్గరకు మృత్యువు రాదు అన్న అతిశయించిన అహంకారముతో విశ్వశాంతిని భంగపరిచి,లోక కళ్యాణమునకు విఘ్నకారకులైన రాక్షసుల మదమును అణిచి నిగ్రహించేవాడు,జగన్నటకము ఆడటంలో విశారదుడు, సృష్టికర్త అయి (బ్రహ్మదేవుడై),పొషించే వాడై(నారాయణుడై),లయకర్త అయిన్ (భవుడైన పరమ శివుడై) వాడు,కేవలం తన చూపులతో జగత్తును సృష్టించగలిగిన వాడు,మహానందుని భార్యైన యాశోదా దేవి కుమారుడైన బాలకృష్ణుని స్మరించేదను.

2.వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికి దయా
శాలికి శూలికి శిఖరిజాముఖపద్మ మయూఖమాలికి
బాలశశాంకమౌళికి( గపాలికి మన్మధ గర్వపర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్యమనస్సరసీరుహాళికి
నిత్యమూ ఆనంద తాండవం చేసేవాడు,ఆనందనిలయుడు,దయాస్వరూపుడు,త్రిశూలధారి, హిమవంతుని కూతురు అయిన పార్వతీదేవి ఒక్క ప్రకాశవంతమైన ముఖపద్మమును తన హృదయమందు నిలుపుకున్న వాడు,తన జాటజూటమున బాల చంద్రుని నిలుపుకున్న వాడు,కపాలములను ధరించిన వాడు,మన్మధుని గర్వపర్వతమును సమూలముగా నాశనం చేసిన వాడు,నారదాది ముని ముఖ్యులందరి మనస్సు అనెడి పద్మములందు విహరించేవాడు అయిన పరమశివునికి శరణాగతి చేసి ప్రణమిల్లుతున్నాను.

3.అతత సేవ సేసెద సమస్తచరాచర భూతసృష్టివి
జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతానికరనేతకు( గల్మషజేతకు నత
త్రాతకు ధాతకు నిఖిలతాపసలోక శుభప్రదాతకు
సమస్త చరాచరములను,భూతములను సృష్టించినవాడు,సరస్వతీ దేవి హృదయమందు నివాసమేర్పరుచుకుని సుఖించువాడు,వేద రాశి నిర్ణేత సకల దేవతలకు అధినేత,కల్మషమును జయించినవాడు,సకల జీవరాశిని సృష్టించి,రక్షించి భరించెడివాడు,సకల తాపస లోకములకు శుభములు జేకూర్చేడివాడు,విధాత అయిన బ్రహ్మ దేవునికి భక్తితో సేవ చేసేదను.
4.అని నిఖిల ప్రధానదేవతావందనంబు సేసి
అనుచు అఖిల జగత్తుకు ప్రధాన దేవతలకు వందనములు చేసి

5.ఆదరమొప్ప మ్రొక్కిడిదు నద్రిసుతాహృదయానురాగసం
పాదికి దోషభేదికి( బ్రపన్న వినోదికి విఘ్నవల్లికా
ఛ్ఛేదికి మంజువాదికి నశేషజగజ్జననందవెదికి
మోదకఖాదికి సమదమూషకసాదికి సుప్రసాదికి.
పర్వతరాజు పుత్రి అయిన పార్వతీదేవి హృదయమునులోని అనురాగమును సంపాదించినవాడు,మనలోని దోషములును,పాపములను సంహరించెడివాడు,నీవు తప్ప నాకు మరియొక గతి లేదనుచూ శరణాగతి చేసినవాళ్ళను అక్కున చేర్చుకుని ఆదరించటములో ఆనందము పొందెడి వాడు,విఘ్నములనేడి లతికలను చేదించువాడు,మృదు మధురముగా మాట్లాడెడి వాడు,అనంతమైన జగత్తులోని జనులందరూ వెదికేటి ఐశ్వర్యము ఐన వాడు,కుడుములంటే ఎంతో ప్రియము కలిగి భుజించేది వాడు,జగ్గత్తులోని జీవరాశులన్నింటియందు సమదృష్టి కలవాడు,ఎలుకను తన వాహనముగా జేసుకున్న వాడు,శుభములిచ్చువాడు అయిన గణపతికి చెవులకు చేతులానించి గుంజీళ్ళు తీస్తూ మనసారా మ్రొక్కెదను.

6.క్షోణితలంబు నెన్నుదురు సో(క(గ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి( జంచరీకచయసుందరవేణికి రక్షితానత
శ్రేణికి( దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికి
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్
తుమ్మెదకున్న నలుపు రంగు ఎటువంటిదో అటువంటి నల్లటి అందమైన ముంగురులున్న కేశపాశములున్నదీ,వినమృలై శిరస్సు వంచి శరణాగతి చేసిన వారిని కరుణ వర్షమును కురిపించేటటువంటిదై,పద్మముము నుండి జన్మించి జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుని చిత్తమ్మును వశీకరణము చేసుకున్న ఏకైక స్త్రీ,నక్షత్ర మాలను,చిలుకను,పద్మమును,పుస్తకమును తన అందమైన అరచేతులతో పట్టుకున్నదై,వాగ్దేవి అయిన సరస్వతీ దేవికి,నా శిరస్సు,లలాటము నుంచి పాదముల వరకు సర్వాంగములన్నీంటినీ భూదేవికి తాకేలా నమస్కరిస్తూ స్తుతిస్తున్నాను.

7.పుట్టం బుట్ట శరంబున మొలవ నంభొయానపాత్రంబున
నెట్టం గల్గను గాళి( గొల్వను బురాణింప దొరంకొంటి మీ(
దెట్టే వెంత( జరింతు( దత్సరణి నాకీవమ్మ యో యమ్మ మేల్
పట్టు న్మానకుమమ్మ నమ్మితి( జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ.
అమ్మా! సరస్వతీ!సముద్రమంతటి దయా స్వరూపమా!మేము అఙ్ఙానాంధకారములో చిక్కుకొనుటయే కాదు,బాహ్యప్రపంచమనే సముద్రంలో,మా సంసార నౌక చిక్కుకుని ఊగిసలాడుతూ వుంది.అలా చిక్కుకుని ఊగిసలాడుతూ ఉన్నా కూడా నీటిలో రెల్లు గడ్డి పుట్టలు పుట్టలుగా మొలిచినట్లు,సంసారా బంధనాలు కూడా శర పరంపర వలే పెరుగుతున్నవి.ఇట్టి స్థితిలో వున్న మేము నిన్నేట్లా కొలిచేది?నీ గురించి మేమేట్లా చెప్పేది? నీ కథను ఎలా వివరించేది?నీ పాద పద్మములను ఆశ్రయించుటకై నీ ద్వారం వద్దనే అసహనంతో అటూ ఇటూ తిరుగుతున్నాము!మాకు సకల శుభములు చేకూర్చే మార్గం చూపుము తల్లీ!నిన్నే నమ్ముకున్నామమ్మా పరబ్రహ్మ స్వరూపమైన తల్లీ భారతీ!

శారద నీరదేందుఘనసారపటీరమరాళమల్లికా
హారతుషార ఫేనరజతాచల కాశఫణీశకుందమం
దారసుధాపయోధి సితతామరసామరవాహినీశుభా
కారత నొప్పు నిన్ను మదింగానగ నెన్నడుగల్గు భారతీ.
నీటికి చంద్రుని వంటిదైన తెల్లటి పద్మమును ఆసనముగా,హంసను వాహనముగా చేసుకున్నటువంటి దానా,తెల్లటి మల్లె పూల మాలను ధరించేడిదానా,చందనమంతటి చల్లటి తల్లీ,వెండి కొండలా అన్నట్లు మంచుతో నిండి వున్న హిమాలయాల్లో,మంచుచే కప్పబడిన రెల్లుగడ్డిని కనుగొనడం ఎంత కష్టమో,నీ గురించు తెలుసుకోవడం అంతే కష్టమమ్మా!తెల్లటి తామరపై కూర్చున్న దానా!వేద మాతా!మల్లే,మందార పూలలోని మకరందామృతం వున్నంత మధురంగా వుండే పన్నాగశయనుడైన శ్రీ హరి కథ భాగవతం చెప్పడానికి,శుభప్రదంగా పూర్తి చేయడానికి నీ అనుగ్రహం కావాలి.నీ అనుగ్రహం కోసం తపిస్తున్న నేను నా మదిలోనున్న నిన్నెప్పుడు దర్శించగలుగుతానో కదా?

8.అమ్మల(గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
అమ్మలను గన్న అమ్మ,ముగ్గురమ్మలకూ మూలపుటమ్మ,అందరికన్నా చాలా పెద్దమ్మ,సురల శత్రువుల యొక్క అమ్మైన దితికి పుత్రశోకమును మిగిల్చిన అమ్మ,దేవతా స్త్రీల మనస్సులలో నుండి నిత్యం పూజలు అందుకునెడి దుర్గమ్మ మా అమ్మ.అటువంటి అమ్మ నాకు అర్హత ఉందని కాకుండా దయతో మహత్తరమైన(శ్రేష్టమైన) కవిత్వమును( ఙ్ఙానమును),పటుత్వమునను(శక్తిని),సంపదలను(ఐశ్వర్యమును) ఇవ్వుము.

9.హరికిన్ బట్టపు దేవి పున్నెములప్రోవర్ధంభు పెన్నిక్క చం
దురు తో( బుట్టువు భారతీగిరిసుతల్ తోనాడు పూ(బోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురత లేములు వాపు తల్లి సిరియిచ్చు నిత్యకళ్యాణముల్.
శ్రీ హరికి పట్టపు రాణివి,క్షీర సాగర సమయంలో చందురునితో పాటు పుట్టి చంద్రసహోదరివి అనిపించుకున్నదానవు.సరస్వతీ దేవి,పార్వతీ దేవిని నీ సఖులుగా చేసుకుని ఆడుకున్న పూబోణివి.ఎర్రటి తామర పువ్వున ఉండేది దానవు.ఎల్ల లోకాలకు ప్రియమైన దానవు.క్షమా స్వరూపానివి కనుకనే జగములన్నినంటిని మన్నించి,పొషించి గౌరవిస్తున్నావు.
ఎవరికున్న పుణ్యముల రాశిని బట్టి వారికి నిష్పక్షపాతముగా ధన,ధాన్య,పుత్ర,పౌత్ర,పశు సంపదలను ఇవ్వడంలో నిన్ను మించిన వారు లేరు కదా! అమ్మా మహా లక్ష్మీ!నీ కృపాకటాక్షములతో లేములను పోగొట్టి,జగాలన్నిన్నీంటికి నిత్యమూ శుభములిస్తున్నవు కదా!

10.అని ఇష్టదేవతలం జింతించి దినకర కుమార ప్రముఖులం దలంచి ప్రధమ కవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతయించి హయగ్రీవ దనుజకర పరిమిళిత నిగమనివహవిభాగ నిర్ణయనిపుణతాసముల్లాసుండగు వ్యాసునకు మ్రొక్కి శ్రీమహాభాగవతకధా సుధారసప్రయోగికి శుకయోగికి నమస్కరించి మృదుమధుర వచనరచన పల్లవితస్ధాణునకున్ బాణునకుం బ్రణమిల్లి కతిపయశ్లోకసమ్మోదితసూరు మయూరు నభినందించి మహాకావ్య కరణకళావిలాసుం గాళిదాసుంగొనియాడి కవికమల విసరరవిం భారవిం బొగడి విదళితాఘు మాఘు స్తుతియించి యాంధ్రకవితాగౌరవజనమనోహరి నన్నయ సూరిం గైవారంబుసేసి హరిహర చరణారవిందవందనాభిలాషి( దిక్కన మనిషిన్ భూషించి భక్తివిశేషిత పరమేశ్వరుండగు ప్రబంధపరమేశ్వరుం బ్రణుతించి మఱియు నితర పూర్వకవి జనసంభావనంబు గావించి వర్తమాన కవులకుం బ్రియంబు వలికి భావికవుల బహూకరించి యుభయకావ్యకరణదక్షుండనై.
అని ఇష్ట దేవతలను చింతించుచూ,దినకరుడిని,కుమార స్వామి వంటి ప్రముఖులను స్మరిస్తూ,ఙ్ఙానాందసాగరంలో అతిశయించిన ఆనందంలో ఓలలాడేవాడు,రసరమ్యభరితమూరక్తి,
ఆదికావ్యమూ,భక్తి,ముక్తిని ప్రసాదించున్నట్టి రామాయణాన్ని రచించిన తొలి కవి వాల్మీకి మహర్షిని స్తుతించి,హయగ్రీవునకు,రాక్షసులచే అపహరింపబడి ఆపై దనుజులను శిక్షించిన శ్రీహరిచే రక్షింపబడి,ఆపై విధాతను ఆశ్రయించిన అనంతమైన వేదాలను,ఋగ్వేద,యజుర్వేద,
సామవేద,అధర్వణ వేదములుగా విభుజించడంలో అధికమైన ఉల్లాసమును పొందినవాడు అయిన వ్యాస మహర్షికి వందనములిడి,వ్యాసుంచే రచింపబడిన శ్రీ మహాభాగవత రసామృతమును బోధించిన శుక యోగికి నమస్కరించి,మృదుమధుర వచనరచనమనే తరువుకు చిగురించిన శాఖ అయిన బాణునికి ప్రణమిల్లుతున్నాను.కొద్దిపాటి శ్లొకాలతో అందరికీ ముదమును జేకుర్చి సూర్యుని వలే ప్రకాశించిన మయూరుని అభినందిస్తూ,మహా కావ్యాలను రచించడమనే కళలో నిష్ణాతుడైన కాళిదాసును కొనియాడుతూ,కవితలనే కమలాలను వికసింపజేయు భారవి అనే సుర్యుడుని పొగుడుతూ,సంస్కృత భాషా కోవిదుడు,కవి ఐన మఘును స్తుతిస్తూ,ఆంధ్ర కవిత్వమునకు శ్రీకారం చుట్టి,తెలుగు ప్రజల హృదయాలలో గౌరవమును,అభిమానమును సంపాదించుకున్న తొలి ఆంధ్ర కవి నన్నయ్య సూరిని తలుచుకుంటూ,హరిహరచరణారవిందములను నిత్యమూ అభిలషించే తిక్కన సోమయాజిని స్మరిస్తూ,విశేషభక్తి పరమేశ్వరుడైన ప్రబంధపరమేశ్వరుడిని(ఎర్రన్న/ఎర్రప్రగడ) ప్రణుతించి,మరియు ఇతర పూర్వ కవులను ప్రస్తుతించి,ప్రస్తుత కవులను ప్రేమతో పలుకరిస్తూ,భావి కవుల పట్ల గౌరవమును ప్రకటిస్తూ మన అందరికీ శుభములు జేకుర్చే శ్రీమద్ మహాభగవతమును అంధ్రీకరిస్తున్నాను.
ప్రార్ధన:

శుక్లాంభరధరం విష్నుం శశివర్ణమ్ చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

శ్రీ రామచంద్రాయ చరణే శరణం ప్రపద్యేః
శ్రీమతేః శ్రీరామచంద్రాయ నమః
శ్రీ రాఘవం దశరధాత్మజం మప్ర మేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయ దాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం
గోప స్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీం